మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

16, జులై 2016, శనివారం

దాశరధి రంగాచార్య... జీవనయానం

డాక్టర్‌ దాశరథి రంగాచార్య 'జీవన యానం' వార్త ఆదివారం అనుబంధంలో 103 వారాలపాటు ధారావాహికంగా ప్రచురించబడింది.
చినగూడూరులో పుట్టి, భాగ్యనగరంతో పెనవేసుకుపోయిన జీవితం కర్మయోగిలా గడుపుతున్న రంగాచార్య ఆత్మకథ 'జీవనయానం'. ఇందులో ఆరాటం ఉంది. పోరాటం ఉంది. కలలున్నాయి. కన్నీళ్ళున్నాయి. గెలుపు ఓటముల తారట్లాట ఉంది. ముషాయిరాలా హాయిగా కొన్నిచోట్ల, గజల్‌లా గంభీరంగా మరికొన్నిచోట్ల, కొండలు, గుట్టలు ఢీ కొంటూ కొన్నిచోట్ల, ఒదిగిపోతూ, మలుపులు తిరుగుతూ, ఇంకొన్ని చోట్ల సాగిన జీవనది ప్రవాహం ఆయన జీవితం. తన జీవితంలో భీభత్సానికి, భయాలకు, సాహసాలకు, విజయాలకు, విషాదానికి, సంతోషానికి అక్షర దర్పణం పట్టి సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో రచన సాగించారు.
ఇందులో కేవలం రంగాచార్య జీవితమే కాదు, ఏడు దశాబ్దాల తెలుగుజాతి జీవన చిత్రణ ఉన్నది. స్వతంత్ర పోరాటం, రజాకార్ల దౌష్టం, కమ్యూనిస్టుల సారధ్యంలో తెలంగాణా సాయుధపోరాటం, ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు, సాహిత్యోద్యమాలు...అన్నీ ఉన్నాయి.....
తెలంగాణ తొలితరం సాహితీవేత్త, సాయుధ పోరాట యోధుడు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడిగా ఎంతో ప్రాముఖ్యత పొందారు రంగాచార్యులు. ఉపాధ్యాయుడిగా, లైబ్రేరియన్ గా పనిచేసిన రంగాచార్యులు అన్న ప్రముఖ కవి, సాయుధ పోరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. సాయుధపోరాటం ముగిసిన తర్వాత సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు దాశరధి.
దాశరథి రంగాచార్యులు తండ్రి సనాతనవాది. అన్న ప్రముఖకవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల నీడలో.. అభ్యుదయ భావాలు, విప్లవ భావాలను వంటపట్టించుకున్నారు. 1945లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో చిన్నవయసులోనే రంగాచార్యులు కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. ఓవైపు ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే సమాజంలో అసమానతలపై ప్రజలను చైతన్యపరిచారు. రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనకడుగు వేయలేదు. తెలంగాణా సాయుధ పోరాటం నాటి పరిస్థితులను దాశరథి రంగాచార్యులు ‘చిల్లర దేవుళ్ళు‘, ‘మోదుగుపూలు‘, ‘జనపదం‘ నవలల్లో అక్షరరూపం ఇచ్చారు. ‘చిల్లర దేవుళ్లు‘ నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, ‘మోదుగుపూలు‘ నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, ఆతర్వాత పరిస్థితులు జనపదంలో రాశారు. తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తర్వాత ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.
తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి రచించిన ఘనాపాటి రంగాచార్యులు. తెలుగు భాషలో విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ ప్రాంత చారిత్రక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ “జీవనయానం” సాహిత్యంపై చెరగని ముద్ర వేసింది. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనల్ని పక్కన పెట్టి ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దాశరథి రంగాచార్యుల “చిల్లర దేవుళ్లు” నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందుకు గానూ రంగాచార్యులకు  అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి