
నేను ఆత్మ చరిత్ర వ్రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో ఎన్నో సత్య ప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మచరిత్రగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితం అట్టి ప్రయోగాలతో నిండివుంది. వాటన్నింటిని లిపిబద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందలి ప్రతి పుట సత్యప్రయోగాలతో నిండి వుంటే నా యీ చరిత్ర నిర్దుష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన సత్యప్రయోగాలు అన్నింటిని ప్రజల ముందుంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
నా ప్రయోగాలు ఆధ్యాత్మికాలు, అనగా నైతికాలు, ధర్మం అంటే నీతి. ఆత్మదృష్టితో పిన్నలు, పెద్దలు, యువకులు, వృద్ధులు నిర్ధారించగల విషయాలు ఈ కథలో ఉంటాయి. ఈ నా కథను తటస్థుడనై, అభిమానరహితుడనై వ్రాయగలిగితే సత్యాన్వేషణా మార్గాన పయనించి ప్రయోగాలు చేసేవారందరికీ కొంత సామాగ్రి లభిస్తుందని నా విశ్వాసం.
నా ప్రయోగాలు పూర్ణత్వం పొందాయని నేను సమర్థించుకోవడం లేదు. వైజ్ఞానికుడు బుద్ధి కుశలతతో యోచించి పరిశోధనలు చేస్తాడు. అయితే వాటి ఫలితాలే చివరివని భావించడు. వాటిమీద నమ్మకం ఏర్పడినా తాను మాత్రం తటస్థంగా ఉంటాడు. నా ప్రయోగాలు కూడా అటువంటివే. నేను ఆత్మనిరీక్షణ కూడా చేసుకున్నాను. ప్రతి విషయాన్ని పరీక్షించి చూచాను, విశ్లేషించి చూచాను. వాటి పరిణామాలే అందరికీ అంగీకారయోగ్యాలని, అవే సరియైునవని నేను ఎన్నడూ చెప్పదలచలేదు. అయితే ఇవి నా దృష్టిలో సరియైనవని, ఈనాటికి ఇవి చివరివని మాత్రం చెప్పగలను. అలా విశ్వసించకపోతే వీటి పునాది మీద ఏ విధమైన భవనం నిర్మించలేము. చూచిన వస్తువులను అడుగుగునా పరిశీలించి ఇవి త్యాజ్యాలు, ఇవి గ్రాహ్యాలు అని రెండు రకాలుగా విభజిస్తాను. గ్రాహ్యాలను బట్టి నా ఆచరణను మలుచుకుంటున్నాను. ఆ విధంగా మలుచుకున్న ఆచరణ ఎప్పటివరకు నాకు, నా బుద్ధికి, నా ఆత్మకు తృప్తి, సంతోషం కలిగిస్తూ వుంటుందో అంతవరకు దాని శుభపరిణామాలను విశ్వసిస్తూ ఉంటాను.
కేవలం సిద్ధాంతాలను అనగా తత్వాలను గురించి వర్ణనే ముఖ్యమని భావిస్తే ఈ ఆత్మకథ వ్రాయవసిన అవసరం లేదు. కాని ఆ ప్రయోగాలపై చేసిన కృషిని పేర్కొనాలి. అందువల్లనే నేను నా యీ కృషికి ప్రధమంగా సత్యశోధన అని పేరు పెట్టాను. ఇందు సత్యానికి భిన్నమని భావించబడే అహింస, బ్రహ్మచర్యం మొదలుగాగల వాటిని గురించిన ప్రయోగాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం సత్యమే అన్నింటిలోను గొప్పది. అందు పలు విషయాలు నిహితమై వుంటాయి. ఈ సత్యం స్థూలంగా వుండే వాక్సత్యం కాదు. ఇది వాక్కుకు సంబంధించినదేగాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పితసత్యం గాక సుస్థిరత కలిగిన స్వతంత్రమైన అస్థిత్వం గల సత్యం. అంటే సాక్షాత్ పరబ్రహ్మమన్నమాట.
- మోహన దాసు కరంచంద్ గాంధీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి