ఆంధ్రమహాభారతానువాదం :
వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనే రసవద్ఘట్టాలలోనేఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించాయి .
. సంస్కృత మహాభారతం నూరు పర్వాల గ్రంధమనీ, లక్ష శ్లోకాల విస్తృతి కలిగి ఉందనీ ప్రసిద్ధి. ఆది పర్వంలో నన్నయ చెప్పిన పర్వానుక్రమణిక కూడా ఈ విషయానికి దగ్గరగానే ఉంది. ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిపి నూరు ఉన్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంలో కలిసి ఉన్నది. నన్నయ తన పర్వానుక్రమణికలో హరివంశాన్ని చేర్చలేదు. తన అష్టాదశ పర్వ విభక్తంలో నూరు పర్వాలను అమర్చాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పాటించలేదు. తిక్కనాదులు నన్నయ నిర్ణయాన్ని అనుసరించారు. ఎఱ్ఱన హరివంశాన్ని వేరే గ్రంధంగా రచించాడు. ఈ విధంగా నూరు ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో పదునెనిమిది పర్వాల ఆంధ్ర మహాభారతంగా రూపు దిద్దుకొంది. తెలుగులో ఆశ్వాసాలుగా విభజించారు.
పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి వెలువడింది . అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ గళమెత్తి కలం అందుకున్నాడు . అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు. హృద్యంగా, అపూర్వంగా, అఘనిబర్హణం చేసేదిగా వుంటూ, వింటే సమగ్రమైన జ్ఞానాన్ని ఇచ్చేదే మహాకావ్యం అని నన్నయ నిర్వచించాడు. ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని..యధ్యాత్మ వేదులు నీతి శాస్త్రంబని....పద్యంలో .... భారతం ఒక విజ్ఞాన సర్వసం కనుకనే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్తము అంటారు. అధ్యాత్మ విధులు వేదాంతమంటారు. నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవి వృషభులు మహా కావ్యమనీ, లాక్షిణికులు సర్వలక్ష సంగ్రహమనీ, ఇతిహాసకులు ఇతిహాసమనీ, పరమ పౌరాణికుల పురాణ సముచ్ఛయమనీ కొనియాడతారు. భారతం విశ్వ జనీనం.
భారతాంధ్రీకరణలో నన్నయ మూడు లక్షణములు తన కవితలో ప్రత్యేకముగా చెప్పుకొన్నారు -
(1) ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి
(2) అక్షర రమ్యత
(3) నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము.
కలితార్థయుక్తి అంటే కథతో కూడుకొని ఒక మహర్దము ప్రవేశించడం. ఇది ఒక మహాశిల్పం. ఇది నన్నయ్య ఉపజ్ఞ.
భారతంలో నన్నయ సంస్కృత శబ్దములను కొన్నిచోట్ల ¸°గికార్థంలో వాడి కధార్థ యుక్తి కలిగించాడు. ఆంధ్రభాషకు నన్నయ పెట్టిన భిక్ష అక్షయం. మిగిలిన కవులందరూ ఆయన నుండి భాషా శబ్దాలు, పద్య రచనలోని ఒడుపులు గ్రహించారు కాని ఎవరికీ ఆయన ప్రసన్నకధా కలితార్థ యుక్తి మాత్రం అబ్బలేదు.
13, మార్చి 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి