మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

నన్నయ:ఆంధ్రమహాభారతానువాదం



నన్నయ
-
తూర్పింటి నరేశ్ కుమార్
తెలుగు సాహిత్యంను
చదువుకుంటున్న
ప్రతి విద్యార్థి తెలుసుకోదగ్గ పేరు నన్నయ!!!!! ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.... ..... 21వ శతాబ్దంలో నేడు మనం చదువుకుంటున్న సాహిత్యానికి మూలవిరాట్టు.. .....సాహిత్యానికి పెద్దన్నయ్య .....ఈ నన్నయ!!!!! తెలుగు సాహిత్యానికి ఓ దిశా నిర్దేశాన్ని చేసిసాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఘణనీయుడు.... అంతవరకు సాహిత్యానికి రూపురేఖలు లేని కాలంలో.... సరస్వతికి అలంకరణలు చేసిన గొప్పసాహితీవేత్త. అస్తవ్యస్తంగా పడిన తెలుగు భాషామ తల్లి బీజాక్షరాలను
ఓ చోటికి చేర్చిన ఆదికవీంద్రుడు....
శబ్దశాసనుడు ....
ఈయన కాలం 11 వ శతాబ్దం.తూర్పు చాళుక్య వంశానికి రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి.
నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, అరణ్యపర్వాన్ని సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే. ఆంధ్రభాషకు కావ్యము, వ్యాకరరణము రెండింటిని ప్రసాదించాడు నన్నయ్య భట్టు. నన్నయ్య గారు రాజమహేంద్రవరం లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు.అందుకు సరియైన వ్యక్తి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు . ఆపస్తంబ సూత్రుడు, ముద్గల గోత్రుడు, పురాణ విజ్ఞానం, లోక జ్ఞానం, సంస్కృతాంధ్రములలో కవిత్వం చెప్పగల మహా ప్రతిభాశాలి.
రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకున్ని నిండుసభలో పిలిపించి తమ పూర్వీకుల చరిత్ర ఐన [చంద్ర వంశ ప్రభువుల ] పాండునందనల చరిత్రలను వినాలని తన మనోగతాన్ని వినిపించాడు.దానికి ఒప్పుకున్న నన్నయ కు దాన్ని ఎలా మొదలు పెట్టాలో తన సహాధ్యాయి నారాయణ భట్టు సహకారం తీసుకున్నాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు.

పురాణ యుగము/భాషాంతరీకరణ యుగము

సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ ,నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం క్రీ.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.నన్నయ యుగముదీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు.
మొదటి శ్లోకం :

'నన్నయ ఆంధ్ర మహాభారతము శ్రీకారము త్రిమూర్తులను స్తుతించే ఈ సంస్కృత శ్లోకముతో జరిగినది.''
'''శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే'''
'''లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం'''
'''తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై'''
'''ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే'''
(లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుదు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!)

నన్నయగారి చివరిపద్యం:

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన -

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై

(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)
తాత్పర్యం: అవి శరత్కాలంలోని రాత్రులు; మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్రమాలికలతో కూడి ఉన్నవి, వికసించిన కొంగ్రొత్త తెల్ల కలువల దట్టమైనసుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి, అంతటావెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్నిఆవరించిన చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి మిక్కిలి సొగసుగా వున్నాయి.దీంట్లో నన్నయ తనమహాభినిష్క్రమణని సూచించాడా?
విశేషంలో వివరణ ఇలా వుంది: కొందరు పండితులు
ఈ పద్యంలోని చివరిపదగుంఫనం - పాండురుచిపూరములు + అంబరపూరితంబులై -
అని విరవటానికి బదులు - పాండురుచిపూరములన్ + పరపూరితంబులై- అని సంధి విశ్లేషిస్తే,నన్నయ చివరిమాట "పరపూరితంబులై" అని ఏర్పడుతుంది. అంటే భారతం పరులుపూర్తి చెయ్యాల్సిందేనని నన్నయ తన మరణాన్ని సూచించాడు!
=======================
======================================
బాదామి చాళు క్యులు : పశ్చిమ చాళు క్యులు

బాదామి చాళుక్య రాజైన రెండవ పుల కేశి (క్రీ.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని(ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినుని ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అన్న అనుమతితో వేంగిలో స్వతంత్ర రాజ్యం స్థాపించాడు. ఈ ప్రాంతం క్రమంగా వేంగి సామ్రాజ్యంగా పరిణితి చెందింది. కాని రాజరాజ నరేంద్రుని కాలానికి అంతఃకలహాల వలన, శత్రువుల దండయాత్రల వలన వేంగి గణనీయంగా బలహీనపడింది. అయితే తెలుగు సాహిత్యం మాత్రం వ్రేళ్ళూనుకొని అప్పటినుండి మహావృక్షంగా విస్తరించింది. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతి గాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో కవిత్రయంలో మెదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించేవరకు జరగలేదు.
=====================================================================
ఆణిముత్యాలు

మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్ !


సభలో మనసుకు ప్రియంగా ఉండే మంచి వాక్యాలే చెప్పాలి. చాలా తక్కువగా మాత్రమే మాట్లాడాలి.
అదీ సరళంగా, ఎదుటివారు నొచ్చుకొనని రీతిగా మాట్లాడాలి. తెలుగు సాహిత్యంలో ప్రతి ఒక్కరు ఈ పద్యాన్ని నేర్చుకోవాలి .

సత్యవాక్య గొప్పదనం :
ఆణిముత్యాలు
నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటెనొక్క స
త్క్రతు వది మేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు, త
త్సుతు శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

నూరు నూతులకంటె ఒక బావి (దిగుడు మెట్లున్నది) మంచిది. నూరు బావులకంటె ఒక యజ్ఞము మంచిది. అటువంటి నూరు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు. నూరుగురు కొడుకులకంటె ఒక సత్యవాక్యము మేలు.
========================================================================
నన్నయ - శ్రీమదాంధ్రమహాభారతము - అరణ్యపర్వము

అర్జునుడు పరమేశ్వరుని స్తోత్రము చేయుట

దండకము.

శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా
చంద్రధారీ మహేంద్రాదిబృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా
విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి
బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వ
క్రియాకారణం బంచు నానాప్రకారంబులన బుద్ధిమంతుల్ విచారించుచున
నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప
ప్రభావా భవానీపతీ నీవు లోకత్రయీవర్తనంబున మహీవాయుఖాత్మాగ్ని
సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్రక్రియాయంత్రవాహుండవై
తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన నిర్మలజ్ఞానదీప
ప్రభాజాలవిధ్వస్తనిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ
రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహధ్యాన
పీయూషధారానుభూతిన సదాతృప్తులై నిత్యులై రవ్యయా భవ్యసేవ్యా
భవా భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది
నానామునిస్తోత్రదత్తావధానా
లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ
ప్రసాదంబునన సర్వగీర్వాణగంధర్వులున
సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు
నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా
నమస్తే నమస్తే నమః.
========================================================================
మన మహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు....!!!!!

కవిత్రయం తెలుగువారికి ప్రసాదించిన ఆంధ్రమహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు. అనుసృజనం. పునసృష్టి .

1. మూలంలోని హరివంశాన్ని తెలుగు భారతంలో కలుపలేదు.ఇలా భారత గాధను తెలుగులో పాండవనాయకంగా మలచారు.
2. వ్యాసమహర్షి రచనలో శాస్త్రప్రతిపాదనా దృక్ధం, ప్రబోధ ప్రవృత్తీ ప్రముఖంగా ఉన్నాయి. కావ్యస్పృహ తక్కువ. అయితే తెలుగు భారతం ప్రధానంగా కావ్యేతిహాసం. "కావ్యరూప శాస్త్ర ఛాయాన్వయి".
3. వ్యాస భారతంలో శాంతరసం ప్రధానంగా ఉంది. తెలుగుభారతం ధర్మ వీర రస సమన్వితం. రస సమన్వయ రూపకం.
4. వేదం శబ్ద ప్రధానం. ఇతిహాస పురాణాలు అర్ధ ప్రధానాలు. వ్యాస భారతం అర్ధ ప్రధానమైన శాస్త్రేతిహాసం. కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైన కావ్యేతిహాసం.
5. వ్యాసుని శ్లోక రచనా శైలికంటె నన్నయ పద్య రచనాశైలి విశిష్టమైనది, రస వ్యంజకమైనది. అనంతర కవులు నన్నయనే అనుసరించారు.
6. కవిత్రయం యధానువాదంచేయలేదు. స్వతంత్రానువాదంచేశారు. కధను మార్చలేదు. కాని కొన్ని వర్ణనలను తగ్గించారు.
కొన్నింటిని పెంచారు. కొన్ని భాగాలను సంక్షిప్తీకరించారు.
=========================================================
నన్నయ పై కన్నడ పంపన గారి ప్రభావం :
నన్నయ : చంపక మాలలు : 240 చంపకాలు [3 కృతులలో ] :
దేశి ఛందస్సులో కందాలు : 1219 కందాలు :
పంపన : 409చంపకాలు దేశి ఛందస్సులో 730 కందాలు

=====================================================================================
నన్నయ సామెతలు - పలుకుబళ్ళు :
* కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘన బుజుడు [ ఆదిపర్వం 6 -19]
*వెతుకుతున్న తీగ కాళ్ళకు తగిలిందనే -----సామెత
*గుండెలమీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్ర పోవడం -------నుడికారం
*వంటయిల్ కుందేలు సొచ్చె [ ఆదిపర్వం 6 వ అశ్వాసం ]
*అర్జుని వలని భయము సెడి రొమ్మును జేయిడి నిద్రవోయె [ ఆదిపర్వం 6 -63 ]

=========================================================================================
"సుప్రసిద్ధ వాఙ్మయమింకను గన్పడలేదు. చిక్కనిదానికై యంధకారములో తడవులాడుటకంటె, చెవులకింపుగా తెలుగు భారతమును "శ్రీవాణీ"యని మొదలు పెట్టి గోదావరీ తీర రాజమహేంద్రమున, రాజరాజు సన్నిధిని, పాడుచున్న ప్రసిద్ధాంధ్ర కావ్యకవి "నన్నియభట్టు"ను చూతముగాక రండు." -----కాళ్ళకూరు నారాయణరావు.
అని ' కాళ్ళకూరి ' గారు చెప్పిన మాటలు సదా చిరస్మరణీయాలు .
----------------------------------మీ తూర్పింటి .




ఈ వ్యాసం ఇంకా పూర్తి కాలేదు....మిగతాది త్వరలో....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి