మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

14, డిసెంబర్ 2012, శుక్రవారం

ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషకు జవసత్త్వాలు తిరిగి వచ్చేనా ? ---తూర్పింటి నరేశ్ కుమార్

తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన నా ప్రత్యేక వ్యాసం

ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషకు జవసత్త్వాలు తిరిగి వచ్చేనా ?
                                               -----తూర్పింటి నరేశ్ కుమార్

"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా - గతమెంతో ఘనకీర్తి గలవాడా "
...అన్న వేములలపల్లి శ్రీకృష్ణ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. క్రీ.శ. 1 వశతాబ్దిలో ' నాగబు ' శబ్దంతో మొదలైన తెలుగు సాహితీ ప్రస్థానం నన్నయ, తిక్కన ల కాలంలో మొగ్గలు తొడిగి కృష్ణరాయల కాలంలో స్వర్ణయుగంగా పేరొందినది.
20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుని 'సాహితీభారతి 'తనువు పులకరించిపోయింది.ఎంతో ఘన చరిత్ర కలిగినప్పటికినీ...ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే తెలుగు భాషా తేజం మసక బారుతున్నదా? అన్న సందేహం కలుగక మానదు. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం...మాతృభాషాపై తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల తెలుగు భాష క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోతున్నది.
మాతృభాషపై మమకారమేదీ....!!!!
"ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోనుండి
అమ్మ పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకు విందు
దేశభాషలందు తెలుగు లెస్స ".

అని మిరియాల రామకృష్ణ గారు పేర్కొన్నట్లుగా
: శిశువు తల్లి ఒడిలో పాలు తాగుతూ , తల్లి ముఖం నుండి నేర్చుకున్న భాషయే మాతృభాష. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాషయే! భూమిపై జన్మించిన జీవరాసుల్లో బుద్ధి జీవియే మానవుడు .
భాషా సామర్ధ్యం మిగతా జీవులనుండి అతడిని వేరుచేస్తుంది.
భాష అంటే ఒక జాతి చరిత్ర .
భాష అంటే ఆ జాతి జీవనాడి .
శరీరం పనిచేయడానికి హృదయం ఎంత అవసరమో ఒక జాతికి భాష అటువంటిదే అని ఘంటాపథంగా చెప్పవచ్చును. భాషను వదులుకుంటే మన చేజేతులా మన చరిత్రను , సంస్కృతిని మనమే నాశనం చేసుకున్నట్లే. మనిషికి మనస్సు ,మేధ ముఖ్యమైనవి . విద్య మనోవికాసాన్ని , మేధో వికాసాన్ని కలిగిస్తుంది. మనోవికాసానికి సాహిత్య విద్య
మేధో వికాసానికి శాస్త్రీయ విద్య అవసరం.
ఈ రెండింటికీ భాష మూలం.
అన్నం పెట్టేది అవసరానికి ఆదుకునేది ఈ ప్రపంచంలో 'భాష అన్నది జగమెరిగిన సత్యం .
జాతిని , సంస్కృతిని , మానవ సంబంధాలను రూపొందించేది మాతృభాషనే అన్న భావాన్ని
మొక్కగా ఉన్నప్పుడే బాల బాలికల్లో మనం నిర్మించగలగాలి. ఆంగ్లేయుల నుండి స్వేచ్ఛ పొంది 60 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ , వారి మానస పుత్రిక అనబడే ' 'ఆంగ్లభాష ' బారినుండి మనం తప్పించుకోలేకపోతున్నాం.ఈ కాలంలో ఇంగ్లీషు పై వ్యామోహం తగ్గక అది క్రమేపి పెరుగుతూ వస్తుంది. మనది త్రిభాషా సూత్రం. మన విద్యార్థులకు ఏ భాషా సరిగా తలకెక్కదు. మన భాషపై మనకు పట్టు సరిగా ఉండదు. చివరకు నేటి విద్యార్థి జీవితం " రెంటికి చెడ్డ రేవడిలా " భవిష్యత్ అగమ్యగోచరమవుతుంది. మాతృభాష తెలుగు గల విద్యార్థి ఎల్.కె.జి స్థాయినుండి ఆంగ్లంలో విద్యనభ్యసించినపుడు సహజంగా అతను తన భాషా విలువలను , మూలాలను మరిచిపోవడం ఖాయం. 'పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం లాంటిదని' విశ్వకవి రవీంద్రుడు పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. ఉన్నత సామాజిక హోదాకలవారు , గొప్ప గొప్ప చదువులు చదివిన వారు తమకు తమకు తెలుగు బొత్తిగా రాదని చెప్పుకోవడం " స్టేటస్ సింబల్ "గా భావిస్తున్నారనే  విషయం మాత్రం అక్షరసత్యం .
పరభాషా వ్యామోహంలో తన స్వరూపాన్ని కోల్పోతున్న మాతృభాష!
"సంస్కృతం లోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసి పోయె తేట తెలుగునందు " .

అని ఓకవి చెప్పినట్లుగా ...ఇతర భాషలలోని విశిష్ట లక్షణాలను తనలో ప్రోది చేసుకొని
వేల సంవత్సరాలనుండి తరతరాలుగా తన అస్థిత్వంను నిల్పుకుంటున్న తెలుగు భాష
21 వ శతాబ్దంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
అంటే తెలుగు రాష్ట్రమని , తెలుగు దేశమని , తీయనైన తెలుగు
తేట తేటల తెలుగు , దేశభాషలందు తెలుగు లెస్స ...వంటి వాక్యాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవని భావితరాలవారు చెప్పుకోవాల్సిన దుస్థితి ఇంక ఎంతో దూరంలో లేదు.
ఒక సర్వే ప్రకారం ...
"300 సంవత్సరాల తర్వాత తెలుగు భాష అనేది అసలే ఉండదనీ ,
ఆ కాలంలో మళ్ళీ పరిశోధనలు చేసి తెలుగు భాష ,లిపి ఇలా
డాక్టరేట్ పట్టాలు పొందే సౌలభ్యం కలదు.
పాలక వర్గాల విధాన నిర్ణయాలు , అలసత్వం , సరళీకరణ , ప్రభుత్వ ధోరణులు
కాన్వెంట్ నాగరికతకు బీజాలు వేసింది.వీటిల్లో అ , ఆ లకు బదులు ఎ , బి ,సి , డి లు నేర్పిస్తారు. ఇక్కడి ఇంగ్లీష్ మీడియం చదువులు మమ్మీ , డాడీ ల సంస్కృతి , ఆంటీ - అంకుల్ ల శకానికి పునాది రాళ్ళు లేస్తున్నాయని చెప్పవచ్చును. ఉదయమనగా ఇంటినుండి బయలుదేరిన 7 ఏళ్ళచిన్నారి సాయంత్ర సమయానికి మోయలేనిపుస్తకాల భారంతో , అలసిపోయిన ముఖంతో ఇంటికి వచ్చి 'మమ్మీ ' అని పిలుస్తాడు. మమ్మీ అనగానే తల్లులు తమ చిన్నారి ఇంగ్లీష్ లో పిలుస్తున్నాడని మహానందపడి చంకలు గుద్దేసుకుంటారు.
కాని మమ్మీలు అనగా ఈజిప్ట్ భాషలో ' శవాలు ' అని ఎంత మంది తల్లిదండ్రులకు తెలుసు?
ఈ మమ్మీడాడీల కల్చర్ మధ్య తరగతి నుండి దిగువ మధ్య తరగతికి శరవేగంగా వ్యాపిస్తోంది. .
కార్పోరేట్ కల్చర్ , పోష్ నడవడిక , ప్రతీ చిన్న విషయంలో పాశ్చాత్యీకరణకై అర్రులు చాచడం
పబ్ లో 'హగ్ ' లు ...డిస్కోథెక్ లలో 'బెల్లీ డ్యాన్సులు' .... పార్టీలలో 'పార్టీ ' లకై సెర్చింగ్ లు... హైటెక్కులు... డాలర్ కలలు ...వెరసి యువతకు తమ మాతృభాష అంటేనే అదో బ్రహ్మపదార్థంలా వింతగ చూసే పరిస్థితి నేడు నెలకొన్నది.
గరిమెళ్ళ సత్య నారాయణ గారు అన్నట్లుగా ...............................

"ఇంగ్లీషు లేకుంటె ఇహలోకము లోన
ఎవ్వడైనా బ్రతుకగలడా
గువ్వలా బువ్వ తినగలడా
ఆంగ్ల జవ్వనులతో షేకుహాండులు పొందగలడా!
అన్నది ఇక్కడ గమనార్హం ?!
నవతరం తల్లిదండ్రులు పిల్లలకు వారి యిష్టాయిష్టాలతో
ప్రమేయం లేకుండానే బలవంతగా పోటీ పరీక్షలు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు .
6వ తరగతి లోనే IIIT పౌండేషన్ చదువులు .... హావ్వ !ఇదేమి చోద్యం నక్కకు నాకలోకానికి
పొంతన కుదురుతుందా?
బలవంతమైన బరువు చదువులు విద్యా ర్థుల బాల్యాన్ని కుంగదీస్తున్నాయి .
పసి వయస్సులో ఫౌండేషన్ కోర్సులు కోర్సులు, పుస్తకాల మోతలు విద్యార్థికి
పెనుభారంగ పరిణమిస్తోంది.
చదువుల్లొ ఆటవిడుపులు లేక ,గమ్యాన్ని చేరు కోలేక ,మానసిక ఒత్తిడులు తట్టుకోలేని
కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నేడు నెలకొన్నది .
తెలుగు భాషాభివృద్ధికి సూచనలు :
1. ఆం.ప్ర. లోని ప్రతి షాపు పేరు ఖచ్చితంగా తెలుగులోనే ఉండాలి
2) కార్పొరేట్, ఇతర కళాశాలల్లో ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ద్వితీయ భాషగా తెలుగును భోధించాలి.
 3. డిగ్రీ కళాశాలల్లో కూడా తప్పనిసరిగా తెలుగును ద్వితీయగా నిర్భంధంగా అమలు చేయాలి.
డిగ్రీ స్థాయిలో తెలుగు ను కూడ మార్కుల శాతంలో కలపాలి. తెలుగు కు ప్రాక్టికల్సు కూడ నిర్వహించాలి.
4. తెలుగు పరిశోధక విద్యార్థులకు గౌరవ వేతనం ఇవ్వాలి.
5. తెలుగు మాధ్యమంలో పీ.జి. చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ ను కల్పించాలి.
6. అమ్మ, నాన్న,అత్తయ్య,మావయ్య,అన్నయ్య,అక్కయ్య అని పలకడం లో ఉండే మాధుర్యాన్ని
                                                                    నేటి తరానికి వివరించాలి .
7. ప్రాంతాలు వేరైనా,మతాలు వేరైనా ఇకమత్యంతో తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం .
ముగింపు :
తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులెల్ల యెరుగనే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స..... 

  ముగింపు :
తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులెల్ల యెరుగనే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స.....
అన్న పలుకులు అను నిత్యం ప్రతి తెలుగు వాకిళ్ళలో పలకాలంటే తెలుగు వాడి వాక్కు విను వీధుల్లో విహరించాలంటే ప్రతి భాషాభిమాని తన వంతు ప్రయత్నంగా తెలుగు భాషాభివృద్ధికి ఉడతా భక్తిగా తన వంతు కృషి చేయాలి.


18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఆర్.జి.యు.కె.టి బాసర ....ఉపన్యాస పోటీల్లో విజేతలు:The Winners of RGUKT BASAR


ఆర్.జి.యు.కె.టి బాసర ....ఉపన్యాస పోటీల్లో విజేతలు ....ప్రథమ బహుమతి : బి.రేణుక B09 1334 ...Claas:W 6....ద్వితీయ బహుమతి : వెంకటరమణ .... Phi 8 ...ప్రోత్సాహక బహుమతి :చరిత్ర ....B091690..Phi 9---తూర్పింటి

ఉపన్యాస పోటీల్లో విజేతలు
ఆర్.జి.యు.కె.టి బాసర కేంద్రంగా జరిగిన
ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు పోటీపడి ఉపన్యసించారు.
వ్యక్తిగత విభాగాల్లో విజేతలు...
ప్రథమ బహుమతి : బి.రేణుక B09 1334 ...Claas:W 6
ద్వితీయ బహుమతి : వెంకటరమణ ..... Phi 8
ప్రోత్సాహక బహుమతి : చరిత్ర .....B091690 ...Phi 9
వీరికి  బహుమతుల ప్రదానం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (21/02/2011)సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి  బహుమతులు తీసుకోవడం జరిగిందని తెలుగుమెంటర్స్.....
తూర్పింటి.నరేశ్ కుమార్ , బి .బాలకృష్ణ,
డాక్టర్ గోపాలకృష్ణ , విజయ్ కుమార్ , 
సూరిబాబు , శ్రీనివాస్ , ప్రభావతి గార్లు తెలిపారు .
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (21/02/2011)సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి ఉపన్యాస పోటీల్లో బహుమతులు అందుకున్న విజేతలు...తెలుగు న్యాయనిర్ణేతలు( ప్రక్కన )

12, డిసెంబర్ 2010, ఆదివారం

"మాట్లాడే వెన్నెముక.....విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)"


మాట్లాడే వెన్నెముక.....విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)" మాట్లాడే వెన్నెముక-పాట పాడే సుషుమ్న;నిన్నటి నన్నయభట్టు-నేటి కవి సామ్రాట్టు;గోదావరి పలుకరింత-కృష్ణానది పులకరింత;కొండవీటి పొగమబ్బు-తెలుగువాళ్ళ గోల్డునిబ్బు "అని శ్రీశ్రీ ...విశ్వనాథగురించి అన్నారు ----తూర్పింటి నరేశ్ కుమార్

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ....తన శిష్యుని గురించి ఇలా అన్నాడు.....
"నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్
సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్వ్త మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్ ".
శ్రీశ్రీ విశ్వనాథగురించి ఇలా అన్నాడు......
"మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద ".
తెలుగు సాహిత్యంలో ప్రాచీన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం వీరి రచనలు.
సాహిత్యంలో గౌరీశంకర శిఖరం తో వీరిని పోలుస్తారు.
అటువంటి వీరి జీవిత విశేషాలను తెలుసుకోవడం సాహితీ విద్యార్థి గా మనవిధి.
వారి జీవితాంశాలను ఓ సారి పరికిద్దాం....
విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి))
కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు.
తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. 
విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లిమరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులుబందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూల్ లోచెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం.
బి.ఎ. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూల్ లోనే ఉపాధ్యాయునిగా చేరాడు.
ఉద్యోగం చేస్తూనే మద్రాసువిశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు.
తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు..
విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.
ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు,
విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి.
ఆయన మాటలలోనే చెప్పాలంటే.......
"నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను
చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ...అని అన్నాడు .ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును.
విశ్వనాథ గురించి జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు -
"ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి.
వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు.
గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో
ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది.వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో,
భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది.
మహాకవి గా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం.
విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాధ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి
పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన
పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!
ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచయితలను కొన్నైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే
ఆయన అంతర్జాతీయ ఖ్యాతినర్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు.
***అయితే విశ్వనాధ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యపడదు అన్నది జగమెరిగిన సత్యం .
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు.
ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు.
* జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠపురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది.********

********"As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare "range" Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene".**************************

*తమిళనాడులోని మధురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు
మళయాళంలోనికి,అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది.
ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు.
*వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించాడు.
*భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి.
*కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు.
*విశ్వనాధ నవలలలో పురాణవైర గ్రంధమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ
భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతో నిండిన కధ,
అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.
విశ్వనాధ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది.
తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఇందువల్ల విశ్వనాధను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు.
ఛాందసుడు అనీ, "గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు.
విశ్వనాధకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు.
షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు.
గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాధకు తన ప్రతిభ గురించ అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు.
తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు
లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నాడు విశ్వనాధ.

"అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్ ".
జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాధ అనేవాడు.
శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవాడు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి
గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవాడు.
విశ్వనాధ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు: -
"ఆహారపుష్టి గల మనిషి. ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం. కాఫీలో గాని తాంబూలంలోగాని ఎక్కువగా పంచదార వాడేవారు.
ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల.
మనస్సు నవ్య నవనీతం. వాక్కు దారుణాఖఁడల శస్త్రతుల్యం. చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంధాలు. వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంధాలు.
చిన్నలలో చిన్న, పెద్దలలో పెద్దగా వదిగి పోయే స్వభావం. శారీరికంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి.
విమర్శలూ, స్తోత్రాలూ, తిట్లూ, దీవెనలూ, దారిద్ర్యం, ఐశ్వర్యం - ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు. ఒకమాటలో ఆయన
అపూర్వమైన 'దినుసు' అని ప్రశంసించాడు.
అవార్డులు - రివార్డులు :
*ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సామ్రాట్" బిరుదుతో సత్కరించింది.
* 1964లో ఆంధ్రా యూనివర్సిటీ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.
* 1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
* శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
* "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
* 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
* 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
నవలా సాహిత్యం :
* వేయిపడగలు
* స్వర్గానికి నిచ్చెనలు
* చెలియలికట్ట
* ఏకవీర
* తెఱచిరాజు
* మాబాబు
* జేబుదొంగలు
* వీరవల్లడు
* వల్లభమంత్రి
* విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
* పులుల సత్యాగ్రహము
* దేవతల యుద్ధము
* పునర్జన్మ
* పరీక్ష
* నందిగ్రామరాజ్యం
* బాణావతి
* అంతరాత్మ
* గంగూలీ ప్రేమకధ
* ఆఱునదులు
* చందవోలు రాణి
* వేయి పడగలు
* శ్రీమద్రామాయణ కల్పవృక్షము
* కిన్నెరసాని పాటలు
* విశ్వనాధ మధ్యాక్కఱలు
* ప్రళయనాధుడు
* హాహాహూహూ
* మ్రోయు తుమ్మెద
* సముద్రపు దిబ్బ
* దమయంతీ స్వయంవరము
* నీల పెండ్లి
* శార్వరి నుండి శార్వరి దాక
* కుణాలుని శాపము
* ధర్మచక్రము
* కడిమిచెట్టు
* వీరపూజ
* స్నేహఫలము
* బద్దన్న సేనాని
* దిండు క్రింది పోకచెక్క
* చిట్లీచిట్లని గాజులు
* సౌదామిని
* లలితాపట్టణపు రాణి
* దంతపు దువ్వెన
* దూతమేఘము
* కవలలు
* యశోవతి

* పాతిపెట్టిన నాణెములు
* సంజీవకరణి
* మిహిరకులుడు
* భ్రమరవాసిని
* పురాణవైర గ్రంథమాల (పన్నెండు నవలలు)
o భగవంతునిమీది పగ
o నాస్తిక ధూమము
o ధూమమరేఖ
o నందో రాజా భవిష్యతి
o చంద్రగుప్తుని స్వప్నము
o అశ్వమేధము
o అమృతవల్లి
o పులిమ్రుగ్గు
o నాగసేనుడు
* హెలీనా
* వేదవతి
* నివేదిత
* నేపాళరాజ చరిత్ర (ఆరు నవలలు)
* కాశ్మీర రాజ చరిత్ర (ఆరు నవలలు

* శ్రీమద్రామాయణ కల్పవృక్షము
(6 కాండములు)
* ఆంధ్రప్రశస్తి
* ఆంధ్రపౌరుషము
* విశ్వనాథ మధ్యాక్కఱలు
* ఋతు సంహారము
* శ్రీకుమారాభ్యుదయము
* గిరికుమారుని ప్రేమగీతాలు
* గోపాలోదాహరణము
* గోపికాగీతలు
* భ్రమరగీతలు



* ఝాన్సీరాణి
* ప్రద్యుమ్నోదయము
* రురుచరిత్రము
* మాస్వామి
* వరలక్ష్మీ త్రిశతి
* దేవీ త్రిశతి (సంస్కృతం)
* విశ్వనాథ పంచశతి
* వేణీభంగము
* శశిదూతము
* శృంగారవీధి
* శ్రీకృష్ణ సంగీతము
* నా రాముడు
* శివార్పణము
* ధర్మపత్ని
* భ్రష్టయోగి (ఖండకావ్యము)
* కేదారగౌళ (ఖండకావ్యము)
* గోలోకవాసి
* దమయంతీస్వయంవరం
నాటకములు :
* అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
* గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
* గుప్తపాశుపతము
* అంతా నాటకమే
* అనార్కలీ
* కావ్యవేద హరిశ్చంద్ర
* తల్లిలేని పిల్ల
* త్రిశూలము
* నర్తనశాల
* ప్రవాహం

* లోపల - బయట
* వేనరాజు
* అశోకవనము
* శివాజి - రోషనార
* ధన్యకైలాసము
* నాటికల సంపుటి (16 నాటికలు)

విమర్శలు :
* అల్లసానివారి అల్లిక జిగిబిగి
* ఒకనాడు నాచన సోమన్న
* కావ్య పరీమళము
* కావ్యానందము

* నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
* విశ్వనాధ సాహిత్యోపన్యాసములు
* శాకుంతలము యొక్క అభిజ్ఞానత
* సాహిత్య సురభి
* నీతిగీత
* సీతాయాశ్చరితమ్ మహత్
* కల్పవృక్ష రహస్యములు
* సాహితీ మీమాంస.
@@@@@@ ఇతరములు @@@@@@
* కిన్నెరసాని పాటలు
* కోకిలమ్మ పెండ్లి
* పాము పాట
* చిన్న కథలు
* ఆత్మ కథ
* విశ్వనాధ శారద (3 భాగాలు

* యతిగీతము
* What is Ramayana to me.

ఆంధ్ర పౌరుషము నుండి ఈపద్యం ను చదవండి

గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు
అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు గట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
రామాయణ కల్పవృక్షం నుండి.......
ఆకృతి రామచంద్ర విరహాకృతి
కన్బొమ తీరు రామ చాపాకృతి
కన్నులన్ ప్రభు క్రుపాకృతి
కైశిక మందు రామదేహాకృతి
సర్వ దేహమున యందు రాఘవ వంశ మౌళి ధర్మాకృతి
కూరుచున్న విధమంతయు రామచంద్ర ప్రతిజ్ఞ మూర్తియై.

విశ్వేశ్వర శతకము నుండి

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!

కిన్నెరసాని పాటల నుండి

నడవగా నడవగా నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది
కడు సిగ్గు పడు రాచకన్నెలా తోచింది
బెడగు పోయిన రత్నపేటిలా తోచింది.

కోకిలమ్మ పేళ్ళి నుండి......
చిలుక తల్లి మహాన్వయంబున
నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
కోకిలమ్మా తెలుగు పలుకూ
కూడబెట్టినదీ

మరొకటి......
వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
అంగనామణి పెండిలియాడి కూడ
ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె..................?????

5, డిసెంబర్ 2010, ఆదివారం

వినాయక చవితి పండుగ

వినాయక చవితి

దశరూపకాలు/దృశ్య కావ్యములు

దశరూపకాలు/దృశ్య కావ్యములు
స్టేజి పై ప్రదర్శించడానికి వీలయినవి.వీనికే రూపకములని పేరు.ఇవి 10 రకాలు.
1.నాటకము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము ఉదా :రామయణం, భారతంలోని కథా వస్తువు.
*దీనిలో నాయకుడు ధీరోదాత్తుడు.5 -10 అంకాలు వస్తాయి.నాయక వధ జరగదు.
*నాయకుడు మరణించినా మళ్ళీ జీవించాలి.
*నాందీ ప్రస్తావనలతో మొదలై , భరత వాక్యంతో ముగింపు.
2.ప్రకరణము :
*ఇది కల్పిత వస్తువు.ఇందులో కథ లోక సంబందితమైనది.కవి కల్పితమై ఉండును.
*నాయకుడు ధీరశాంతుడు.అమాత్య, విప్ర , వణిజులలో ఎవరో ఒకరు నాయకుడు.
*10 అంకాలుంటాయి.నాటకానికి దీనికి భేదం ఎక్కువగా లేదు.
బాణము :
*ఇందులో కవి కల్పితమైన ధూర్తవృత్తం ఇతి వృత్తం.
*ఇందులో ఉక్తి - ప్రత్యుక్తులు ఆకాశ భాషితాలు.
4.ప్రహసనము :
*ఇది హాస్యరస ప్రధాన రూపకము.
*ఇది 3 విధాలు శుద్ధ , వికృత , సంకీర్ణ :
5.డిమము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము .14 మంది ధీరోద్ధత నాయకులు ఉంటారు.
*దేవ, కిన్నెర , యక్ష , రాక్షస,భూత,ప్రేత , పిశాచాదులు.
*4 అంకాలుంటాయి.ఇందులో రౌద్రం అంగి రసము .
6. వ్యాయోగము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము .ఏకాంకము .
*ధీరోద్ధతులు పలువురు ఇందులో నాయకులు.
*ప్రస్తావనాది నాట్య ధర్మములలో ఇది నాటకముతో సమానం.
7.సమావాకారము :
*దీనిలో 3 అంకాలుంటాయి. ప్రఖ్యాత వస్తువై ఉండాలి.
*దీనిలో వీరరసం అంగిరసం...మిగిలినవి అంగరసాలు..ఇందులో దేవదానవులు 12 గురు నాయకులుగా ఉంటారు.
అంకములలో కపట, ఉపద్రవాలు విడువదగినవి.
8 .వీథి :
*ఇది కల్పిత ఇతివృత్తము కలది .13 వీథి అంగములు దీనిలో ఉండాలి.
*1 - 2 పాత్రలుంటాయి. వీథి వలె అన్నింటికి మార్గం కావున దీనికాపేరు కలిగినది.
9. అంకము :
*దీనికి ఉత్సుష్టి అంకమని పేరు .
*దీనిలో వస్తువు ప్రఖ్యాతమో కవి కల్పితమో అయి ఉండాలి.
*దీనిలో ప్రధాన రసం కరుణము. నాయకులు ప్రాకృత మనుష్యులు.
*సంధులు ,వృత్తులు మొదలగు వాటిలో బాణముతో సమానము.
10.ఈహామృగము :
*ఇది మిశ్రమ వస్తుకము .దీనిలో 4 అంకములు ఉంటాయి.
*ధీరోద్దతులైన నర దివ్యులలో ఒకరు నాయకుడు...రెండవవాడు ప్రతి నాయకుడు.
*ప్రతి నాయకుడు చేతికి చిక్కినా అతనిని వధింపరాదు.
*దీనికి వ్యాయోగమునకు భేదము లేదు.
======= తూర్పింటి నరేశ్ కుమార్

11, నవంబర్ 2010, గురువారం

చిలకమర్తి లక్ష్మీనరసింహం (Chilakamarthi Lakshmi Narasimham) (1867 - 1946)

చిలకమర్తి లక్ష్మీనరసింహం (Chilakamarthi Lakshmi Narasimham) (1867 - 1946):
ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త.
19వ శతాబ్దం చివర, 20 వశతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల
వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు.
ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది
తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేడు.
జననం సెప్టెంబరు 26, 1867పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో
ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
మరణం జూన్ 17, 1946
ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు.
1889లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీస్ పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం హైస్కూల్ గా మార్చబడింది.

30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు.
ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.
1946, జూన్ 17[2] న లక్ష్మీనరసింహం మరణించాడు.పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు.
కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించాడు. ఆయన వ్రాసిన నవలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశాడు. ఇంకా అనేక రచనలు చేశాడు.
1908లో ఒక ప్రెస్ స్థాపించాడు. 1916లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించాడు.
దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించాడు.
లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల ప్రారంభించి 13 సంవత్సరాలు నడిపాడు.
బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నాడు.
దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశాడు.* ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది.
* కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్‌పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
* అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు (సరి చూడాలి)
* 1894లో ఆయన రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
* కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశాడు.
* 1897లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు.
* మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించాడు.
* చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు.
* ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు.
* భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు.
* ఆయన రచన గణపతి నవల హాస్యరచనలలో ఎన్నదగినది.
నాటకాలు
1. కీచక వధ -1889
2. ద్రౌపదీ పరిణయం -1889-1890
3. శ్రీరామ జననం -1889-1890
4. పారిజాతాపహరణం -1889-1890
5. సీతా కళ్యాణం -1889-1890
6. గయోపాఖ్యానం -1889-1890
7. నల చరిత్రం -1892
8. ప్రసన్నయాదవం - 1906 (ప్రదర్శింప బడింది, కాని ప్రచురింపబడలేదు)
9. నవనాటకము
నవలలు

1. రామచంద్ర విజయము - 1894 (ధారావాహిక)
2. హేమలత -1896 (చారిత్రిక నవల)
3. అహల్యాబాయి - 1897
4. సౌందర్య తిలక - 1898 - 1900
5. పార్వతీపరిణయము
6. గణపతి

కవితలు

1. పృథ్వీరాజీయము (అముద్రితం)

అనువాదాలు

1. పారిజాతాపహరణము (సంస్కృత నాటకం నుండి)
2. అభిషేక నాటకం (భాసుని సంస్కృత నాటకం నుండి)
3. స్వప్న వాసవదత్త (భాసుని సంస్కృత నాటకం నుండి)
4. మధ్యమ వ్యాయోగము (భాసునిసంస్కృత నాటకం నుండి)
5. ఋగ్వేదం (ఒక మండలం)
6. ధర్మ విజయం (పి. ఆనందాచార్యులు మహాభారత కథ ఆధారంగా అంగ్లంలో రచించిన నవల)
7. సుధా శరచ్చంద్రము - (బంకించంద్ర ఛటర్జీ ఆంగ్ల నవల "LAKE OF PALMS")
8. వాల్మీకి రామాయణం (కృష్ణమూర్తి అయ్యర్ రచన)
9. రఘుకుల చరిత్ర (కాళిదాసుని రఘువంశం నుంచి)

ఇతర రచనలు

1. రాజస్థాన కథావళి
2. మహాపురుషుల జీవిత చరిత్రలు
3. కృపాంబోనిధి
4. చిత్రకథాగుచ్ఛ
5. సమర్థ రామదాసు
6. భల్లాట శతకం
7. స్వీయ చరిత్ర
8. ప్రకాశములు (4 సంపుటములు)
9. భాగవత కథా మంజరి
10. రామకృష్ణ పరమహంస చరిత్ర
11. కాళిదాస చరిత్ర
12. చంద్రహాసుడు
13. సిద్ధార్థ చరిత్ర